ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 6:17 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భీమిని పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ.

భీమిని పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ.
అర్జున్ సమాచారం సెప్టెంబర్ 21 బెల్లంపల్లి నియోజకవర్గం ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో గల భీమిని పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తాండూర్ సీఐ దేవయ్య,భీమిని ఎస్‌ఐ కోటేశ్వర్ పుష్పగుచ్ఛాలు అందించి డీసీపీకి స్వాగతం పలికారు. అనంతరం డీసీపీ పోలీసు వందనాన్ని స్వీకరించారు.ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను,వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను డీసీపీ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రిసెప్షన్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు.స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో కేసుల వివరాల నమోదు, అప్‌లోడ్ ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల ఫైళ్లు,క్రైమ్ రికార్డులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి,పెండింగ్ వ్యవహారాలపై సీఐ దేవయ్య,ఎస్‌ఐ భూమేష్‌లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు, సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలని సూచించారు.మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేకంగా కృషి చేయాలని తెలిపారు.ప్రజల భద్రత దృష్ట్యా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని,సీసీ కెమెరాల అవసరం, ప్రాముఖ్యతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు.
అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు.